| ఇతిహాసములు | మొల్ల రామాయణము | సుందర కాండము |
| సీత రావణుని దెగడి శ్రీరాముని బొగడుట | ||
| క. |
పతి దైవముగా నెప్పుడు మతిఁ దలఁచుచు నుండునట్టి మగువలఁ జెఱుపన్ బ్రతిన గలయట్టి నీతోఁ బ్రతివచనము లాడుకంటెఁ బాపము గలదే? |
59 |
| క. |
పర దారాపేక్షకులగు పురుషుల కాయువు నశించుఁ, బుణ్యము సెడు, స త్పురుషుల దూషింపఁగఁ దుది నరకంబునఁ బడుదు రనెడి న్యాయము వినవే? |
60 |
| వ. | అదియునుం గాక, | 61 |
| క. |
తన సాహసంబు తానే కొనియాడు నతండు హీన గుణుఁ డని వినుచున్ నిను నీవ పొగడుకొంటివి వినఁగూడదు నీదు నీతివిరహితభాషల్. |
62 |
| శా. |
సంగర రంగమందు నతి శౌర్యమునన్ రఘురాముతోడ మా తంగ తురంగ సద్భట శతాంగ బలంబులఁ గూడి నీవు పో రంగను నోప, కిప్పుడు విరాధ ఖరాదుల పాటుఁ జూచియున్ దొంగిలి నన్నుఁ దెచ్చితివి, తుచ్ఛపుఁ బల్కులు పల్కఁ బాడియే. |
63 |
| సీ. |
కూఁకటి ముడికినై కురులు గూడని నాఁడె-బెదరక తాటకఁ బీఁచ మణచెఁ, గాధేయుఁ డొనరించు క్రతు రక్షణము సేయఁ-బెక్కండ్రు దైత్యుల నుక్కణంచె, నవనిపై విలసిల్లు నఖిల రాజన్యులు-వ్రేలఁ జూపఁగఁ లేని విల్లు విఱిచె, ఘోరాటవులలోనఁ గ్రుమ్మరు నప్పుడు-ఖర దూషణాది రాక్షసులఁ జంపెఁ, |
|
| తే. |
బాద రజమున నొక ఱాయిఁ బడఁతిఁ జేసె-లీల మాయా మృగంబును గూలనేసె, రాజమాత్రుండె మేదినీ రక్షకుండు-రామ భూపాలుఁ డాదినారాయణుండు. |
64 |
| తే. |
అట్టి రామున కీయది యనఁగ నెంత? లంక యన నెంత? దనుజుల పొంక మెంత? నీ వనఁగ నెంత? నీ లావు చేవ యెంత? చెప్ప నేటికి నీవె చూచెదవు గాక! |
65 |
| శా. |
వీరాలాపము లాడ నేల వినుమీ, విశ్వ ప్రకాశంబుగాఁ బారావారముఁ గట్టి, రాఘవుఁడు కోప స్ఫూర్తి దీపింపఁగా ఘోరాజిన్ నిను డాసి, లావు కలిమిన్ గోటీర యుక్తంబుగాఁ గ్రూరాస్త్రంబుల మస్తముల్ దునిమి, భుక్తుల్ బెట్టు భూతాళికిన్. |
66 |
| శా. |
ఆరూఢ ప్రతిమాన విక్రమ కళాహంకార తేజో నిథిన్ శ్రీరామున్, సుగుణాభిరాముఁ దెగడన్ జేకొన్న నిన్నాజిలో దారన్ దొంగిలితంచు నిష్ఠురగతిన్ దండించి ఖండింప ము న్నీ రెట్లైనను దాఁటివచ్చు నలుకన్ నేఁ డెల్లి శాంతింపుమా. |
67 |
| వ. |
అని తన్నుఁ జీరికిం గొనక వీరాలాపంబు లాడ నా రావణుఁ డొడుపు దప్పిన కాలాహి చందంబున నుగ్రుండై మండిపడి యిట్లనియె. |
68 |