| ఇతిహాసములు | మొల్ల రామాయణము | సుందర కాండము |
| త్రిజటా స్వప్న వృత్తాంతము | ||
| మ. |
కల గంటిన్ వినుఁ డింతులార! మన లంకా ద్వీప మీ యబ్ధిలో పల వ్రాలన్, మన రావణేశ్వరుని శుంభద్రత్న కోటీరముల్ కలనన్ గూల రఘూద్వహుం డెలమితో గంధద్విపంబెక్కి, యు జ్జ్వల కాంతిన్ విలసిల్లు సీతఁ గొనిపోవన్ మిన్నకే నిప్పుడే. |
85 |
| క. |
శుద్ధాత్ముఁ డైన రాముఁడు శుద్ధాంతపు దేవిఁ గాని శుభ సూచకముల్ సిద్ధమయి తోఁచుచున్నవి సిద్ధంబీ మాట వేద సిద్ధాంతముగాన్. |
86 |
| క. |
కావున నిక్కోమలి యెడఁ గావలి యున్నట్టి మీరు కఠినోక్తులు గా నేవియు నాడకుఁ, డిఁక నీ దేవియు రక్షింప మనకు దిక్కగు మీఁదన్. |
87 |
| వ. | అని చెప్పి మఱియును, | 88 |
| క. |
అమ్మా! వెఱవకు మదిలో నిమ్ముగ మఱి వేడ్క నుండు మిఁక, నీ మగఁడున్ నెమ్మిగ నినుఁ గొనిపోవును, మమ్మందఱ మనుపు మమ్ము! మఱవక కరుణన్. |
89 |
| ఆ. |
అనుచు దనుజ కాంత లంతంత నెడఁ బాసి నిదుర వోయి, రంత నదరి సీత తనకు దిక్కు లేమిఁ దలపోసి దుఃఖింపఁ బవన సుతుఁడు మనుజ భాషఁ బలికె. |
90 |