| ఇతిహాసములు | మొల్ల రామాయణము | యుద్ధ కాండము - ప్రథమాశ్వాసము |
| రాక్షస వీరులతో రావణుని మంతనము | ||
| సీ. |
అక్కడ రావణుం డఖిలమంత్రుల వేగ-రావించి తగగ వారలకు ననియె మంత్రిసత్తములార! మర్కటుండొకఁ డేఁగు-దెంచి మనందఱం గొంచెపఱిచి రాక్షస వీరుల రణభూమిఁ బొలియించి-వనమంత బెకలించి వార్ధిదాఁటి పోయెను బోరానిపోకలఁ బోవుచు-వాఁడు శ్రీరామునివద్దకేఁగి |
|
| తే. |
ఏమి చెప్పునో యామీఁద నామనుష్యు-లిద్దఱును వానరులఁగూడి యేపుమీఱ వచ్చి లంకాపురములోనివారినెల్ల-నేమి చేయునొయిపుడు నాకేమి దారి. |
8 |
| వ. |
అని యిట్లు రావణుండు నిండు పేరోలగంబునఁ గూర్చుండి డోలాయమానమానసుండై విచారించుచుండ నాసమయంబున విభీషణుండు సాయం సంధ్యావిధిం దీర్చికొని తన మంత్రులుం దానును గొల్వుకూటంబున కేతెంచి పెద్ద గద్దియపైఁ గొలువున్న యన్నకు సాష్టాంగ దండప్రణామంబు లాచరించిన నతండును సంతోషించి యనుజునకు నర్హపీఠంబుఁ జూపిన నాసీనుండై యన్నకిట్లనియె. |
9 |