| ఇతిహాసములు | మొల్ల రామాయణము | యుద్ధ కాండము - ప్రథమాశ్వాసము |
| రావణుఁడు విభీషణుని దూషించుట | ||
| తే. |
నీవు నాదాయతోఁ గూడి నీచబుద్ధి! బుద్ధి సెప్పెదు నాకుఁ దమ్ముఁడవె నీవు కడగి నీమంత్రులును నీవుఁ గంటిలోని నెరసు సరవిగ నున్నారు నిశ్చయముగ. |
20 |
| తే. |
నాకుఁ దమ్ముఁడవయ్యు ననార్యముగను నాదుశత్రులఁ బొగడుచు నాకు బుద్ధి సెప్పవచ్చితి వౌరౌర సిగ్గులేక యిచ్చవర్తింపుచుండు టిదేమి పనిర. |
21 |
| వ. | అనిన విభీషణుం డన్న కిట్లనియె. | 22 |
| తే. |
నిన్నుఁ జంపఁగఁ దలపోసి నీదుమంత్రి వరులు గాచుచు నున్నారు వలదు గోత్ర కలహ మీచెడుబుద్ధి యేకరణి నబ్బె నన్న? యింకొక్క కొన మాట యాలకించు. |
23 |
| వ. |
రామచంద్రుం డాదినారాయణుండు సీత యాదిలక్ష్మి వానరబలంబు బృందారక సందోహంబు గావున నీ వా రామచంద్రున కెదిరి జయంబు గొనుట కడింది కార్యంబు నేఁ జెప్పిన బుద్ధి విని వేగ నా రాముని శరణు చొఱుము. సుఖంబుగ మనుము. అని విన్నవించిన హితవచనంబులు రోగికిఁ బథ్యాహారంబు రుచింపని పోలికను వీనుల కసహ్యంబు లైయుండ రావణుండు మండిపడి యిట్లనియె. |
24 |
| సీ. |
పటువిషం బొలికించుపాములతో నైన-జెలఁగి యింపుగఁ జెల్మి సేయవచ్చుఁ గాని శత్రుల నెప్డు గైవారములు సేయు-వానినిఁ దన ప్రాణబంధునైనఁ జేరఁ దీసినయేనిఁ జేటు వాటిల్లును-గావున వీనిబల్గర్వ మణతు విను కుంభకర్ణ! నీవును రాకమునుపు నీ-చెడుగు నాకును బుద్ధి చెప్పఁ బూనె |
|
| ఆ. |
ననుచు హుంకరించి యవ్విభీషణుఁ బట్టి-వేగఁ గత్తిఁ బూని వ్రేయఁ బోవ నటప్రహస్తుఁ డప్పు డడ్డమ్ముగా వచ్చి-దేవ! నీకుఁ దగునె యీవిధంబు. |
25 |