| ఇతిహాసములు | మొల్ల రామాయణము | యుద్ధ కాండము - ప్రథమాశ్వాసము |
| పర్వతములు రువ్వి వారిధిపై వారధి తీరుప వానర వీరుల సముత్సాహము | ||
| శా. |
కూపారుండును సంతసిల్లి జలజాక్షుం జూచి మిన్నంది స ల్లాపం బుద్ధతిఁ బొంగఁ జూచి విరసోల్లాసంబునన్ రాఘవ క్ష్మాపాలుండును గోపముం గదుర నీగర్వంబు నాచేత వ మ్మైపోనిప్పుడటంచు లక్ష్మణుఁడు విల్లందియ్యఁ బెన్వీఁకతోన్. |
36 |
| మ. |
పరుషోద్యత్కుటిలాకృతిన్ బొమలుచూపట్టంగ శోణప్రభో త్కరరేఖ ల్గనుఁ గొల్కుల న్నిగుడఁ గోదండంబు చేఁదాల్చి భూ వర వంశాగ్రణి రాముఁ డద్భుతముగా వారాశిమీఁదన్ వడిన్ శరజాలంబులు పేర్చి వ్రేయుటయు నిచ్చన్ బ్రాణభీతిన్ వడిన్. |
37 |
| క. |
రాముని యెదుట సముద్రుఁడు తా మానవురూపుఁదాల్చి దైన్యము దోఁపన్ రామునకు మ్రొక్కి యపుడా ధీమంతున కనియె నిలిచి తేజం బెసఁగన్. |
38 |
| ఆ. |
ఇంక నేల తడయ నినకులాధీశ్వర! కపులఁ బంపి వేగఁ గట్టు మయ్య కట్టఁ గట్టి దాటు కమలాప్తకులచంద్ర! నీదు కీర్తిలతకు నెలవు గాఁగ. |
39 |
| వ. |
మిమ్మును దరిసించుటకు మిన్నంటఁ బొంగితి నింతియకాని కపటోపాయంబునఁ బొంగిన వాఁడను గాననిన రామభద్రుండు కరుణాసముద్రుండు గావున సముద్రు నెప్పటి యట్ల యుండ నియమించి వానరులం బనిచిన. |
40 |
| క. |
రాముని పంపునఁ బ్లవగ స్తోమం బట్లరిగియరిగి దొడ్డగుకొండల్ క్షేమమునఁ దెచ్చి జలనిధి రామాజ్ఞను వైచి రధిక రభసం బొప్పన్. |
41 |