ఇతిహాసములు మొల్ల రామాయణము యుద్ధ కాండము - ప్రథమాశ్వాసము
కుంభకర్ణుని సమర వీరము
క. అనిలో నీ వారాముని
ననుపమబలశాలి యైన యనిలతనూజున్‌
ఘనుఁ డగులక్ష్మణుఁ గూలిచి
విను వారలతలలు గొంచు వేగమ రమ్మీ.
48
వ. అని యనిపిన. 49
సీ. భేరీమృదంగాది భీమవాద్యధ్వాన-ములకు సముద్రముల్‌ పొంగిపొరలఁ
గపులపాలికి లయకాలుఁడో యనుచును-వినువీధి దివిజులు వెఱచిఁ తొలఁగ
నతికాయుఁడును మహాహంకారమున వేగ-వెను వెంట రోషప్రవృత్తిఁ జనఁగఁ
గుంభకర్ణుండు కాకుత్స్థు పైఁ బోయిన-దక్షిణోత్తరసముద్రములరీతిఁ
 
తే. గదిసి యిరువురుఁ బోరాడఁ గడగుటయును-గపులు వేవేగ వచ్చిరి విపులశక్తి
సాధ్యగంధర్వపతులెల్ల సరభసమునఁ-జూచుచుండగఁ బోరిరి సురుచిరముగ.
50
AndhraBharati AMdhra bhArati - molla rAmAyaNamu - yuddha kAMDamu - prathamAshvAsamu ( telugu andhra )