| ఇతిహాసములు | మొల్ల రామాయణము | యుద్ధ కాండము - ద్వితీయాశ్వాసము |
| క. |
అమలిన శుభచారిత్రా కమలదళ సమాననేత్ర! కౌశికమిత్రా! ద్యుమణికులవార్ధిసోమా! సమదాసురజనవిరామ! జానకిరామా! |
1 |
| వ. | శ్రీనారదమహామునీశ్వరుండు వాల్మీకి కెఱింగించిన తెఱంగెఱింగించెద నాకర్ణింపు మట్లు. | 2 |
| ఆహవ రంగమునకు రావణాగమనము | ||
| ఆ. |
చారులరుగుదెంచి సౌమిత్రిచే నింద్ర జిత్తుఁ డీల్గె ననుచుఁ జెప్పుటయును బంక్తి ముఖుఁడు సుతునిఁ బలుమాఱు దలఁచుచు వగవఁ జొచ్చె నెల్లవారు వినఁగ. |
3 |
| వ. |
ఇట్లనేక ప్రకారంబులఁ గుమారుం బలవరింపుచు దుఃఖింపుచుఁ గొంతతడవున కూఱడిల్లి ధైర్యంబు నూలుకొల్చి తనకుమారుం జంపినవానిని నేఁ డవశ్యంబును సంగ్రామ రంగంబునఁ జంపుదు నని నియమంబు చేసి తత్క్షణంబ. |
4 |
| సీ. |
శైలసన్నిభములౌ సామజంబులతోడ-ననిలవేగము గల్గు హరుల తోడఁ గాంచనోజ్జ్వలములౌ ఘనరథంబులతోడఁ-బ్రతి లేని ఘనమూల బలముతోడఁ గిమ్మీరవర్ణోరు కేతనంబులతోడఁ-దఱచైన పట్టు ఛత్రములతోడ భేరీ మృదంగాది పృథువాద్యములతోడ-వరశంఖకాహళ ధ్వనులతోడఁ |
|
| తే. |
బాదఘట్టన చలితోర్విభాగుఁ డగుచు-వనధు లెల్లను బిండలివండు గాఁగ నడిచె లంకేశుఁడధిక సన్నాహమునను-రామచంద్రునితోడను రణ మొనర్ప. |
5 |
| మ. |
కరిఘీంకారములున్ మహాజవతురంగవ్రాతహేషావళుల్ వరకోదండనినాదముల్ సుభటదుర్వారాట్టహాసంబులున్ గురుశంఖోజ్జ్వలనాదముల్ దశదిశాక్రోశంబుగా నొక్కటై పరగన్బంక్తి ముఖుండు దా నడిచెఁ గోపస్ఫూర్తి నిశ్శ్వాసుఁడై. |
6 |