ఇతిహాసములు మొల్ల రామాయణము యుద్ధ కాండము - తృతీయాశ్వాసము
క. విమలసుధాకరవదనా!
సుమనశ్చేతోబ్జసదన! సుస్థిరకదనా!
కమనీయరదన! శత్రువి
షమ! రఘుకుల సార్వభౌమ! జానకిరామా!
1
వ. శ్రీనారద మునీంద్రుండు వాల్మీకి కెఱింగించిన తెఱం గెఱింగించెద నాకర్ణింపుము. 2
రావణుని శత్రుంజయ హోమము
క. కలకల పక్షులు గూయఁగఁ
బలపలనై తారకములు పడమటఁ దోఁపన్‌
జలజములు విరియఁ దూర్పున
బలపలనై తెల్లవాఱ భానుఁడు పొడమెన్‌.
3
సీ. అట మున్ను దశకంఠు డాచార్యుఁడైనట్టి-శుక్రానుమతి దేహశుద్ధితోడ
రణజయార్థంబుగా రథములు గుఱ్ఱముల్‌-కవచంబు లస్త్రసంఘములు గలుగఁ
బాతాళగుహఁ జొచ్చి వీతిహోత్రునిఁగూర్చి-పాయక హోమంబు సేయుచుండ
నాహోమధూమంబు లాకసంబునఁ బర్వఁ-గని విభీషణుఁడు భూకాంతునకును
 
తే. విన్నవించెను మాయన్న నిన్న నరిగి-హోమ మొనరింపుచున్న వాఁ డుడుగ కిపుడు
మొనసి యా హోమ మది తుద ముట్టెనేనిఁ-గలనబ్రహ్మాదు లాతని గెలువలేరు.
4
క. ఈపని విఘ్నము సేయఁగ
భూపాలక! కపుల నేర్చి పుచ్చుము లేదే
మీపని విఘ్న మగు ననుడు
భూపాలవరేణ్యుఁ డపుడు భూధరచరులన్‌.
5
చ. గవయగవాక్షవాలిసుతకంజహితాత్మజనీలవాయుసం
భవనలగంధమాదనవిభాషితభల్లుకనాథముఖ్యులన్‌
దివిజవిరోధిపైఁ బనుపఁ దీవ్రత నేఁగి పురంబు సొచ్చి దా
నవపతి సేనలం దఱిమి నాకము భేదిల నార్చి యత్తఱిన్‌.
6
క. గుహ సొచ్చి దనుజవల్లభ!
విహితమె సాహసము విడిచి విను మునివృత్తిన్‌
దహనగతధూతరేఖల
నహరహమును నీకు వ్రేల్వ నర్హంబగునే.
7
క. మగఁటిమి గలిగినపురుషులె
మగతనమును విడిచి నడువ మగువలు నగరా
తగ దనక నేఁడు మఱుగున
విగతవ్రీడుండ వగుచు వేల్వం దగునే.
8
మ. అని కేతెంచి నృపాల శేఖరుఁడు వాహ్యాళి ప్రదేశంబునన్‌
నిను రమ్మంచును బిల్చుచుండ నిచటన్‌ నీవుండి వ్యాజంబునన్‌
దనుజాధీశ్వర! వీరధర్మ మగునే తప్పించుకో నంచు న
వ్వనచారుల్‌ సిగవట్టి యీడ్వఁగను గ్రవ్యాదుండు నిశ్చితుఁడై.
9
క. కదలక హృదయజ్ఞానము
వదలక మంత్రంబుచొప్పు వడి తప్పక లోఁ
జెదరక వ్రేల్చుచు నుగ్రత
జెదరక కూర్చుండె నట గభీర ప్రౌఢిన్‌.
10
వ. అట్లు శిలాస్తంభంబుపగిదిని జలింపకున్న నతనిచేతి యాహుతులు విడిచి
పో వైచి స్రుక్స్రువంబులు నలుఁగఁ ద్రొక్కి యిధ్మంబు హోమద్రవ్యంబులు నొక్కింత
నగ్నిలోఁ ద్రోచి హోమాగ్నిం జిందఱవందఱ చేసి భుజంబు లెక్కి మీసలు పట్టుకొని లాగి
తలలు గదలించి వీనులఁ బెనుబొబ్బలిడి కదలకున్నం గినిసి వాలితనూభవుండంత
నంతఃపురంబునకుం బోయి యందున్న మందోదరినిఁ జుట్టుపట్టి యీడ్చుచు బరువునఁ గొని
వచ్చి దశవదనుముందఱ నిలుప నక్కాంత దుఃఖాక్రాంతయై తనకాంతున కిట్లనియె.
11
AndhraBharati AMdhra bhArati - molla rAmAyaNamu - yuddha kAMDamu - tR^itIyAshvAsamu ( telugu andhra )