అధ్యాత్మ సంకీర్తన
రేకు: 196-4
సంపుటము: 2-495
రేకు: 196-4
సంపుటము: 2-495
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
| చిరకాలధర్మములు చివుకు దవ్వఁగఁబోతే హరిమఱుఁగు చొచ్చితి మాతఁడే రక్షించెను | ॥పల్లవి॥ |
| భువిఁ దొల్లి లేరా పుణ్యము సేసినవారు జవళిశాస్త్రములెల్లాఁ జదివినవారు లేరా దివి కెక్కి దేవతలై తేరినవారు లేరా యివల నే మివి సేసి యెవ్వరిఁ బోలేము | ॥చిర॥ |
| తగఁ దొల్లి వినమా తపము సేసినవారి జిగి నన్నియజ్ఞములు సేసినవారి వినమా మిగులా సిద్ధివడసి మించినవారి వినమా యెగువ నే మింతకంటే యెక్కుడు సేసేమా | ॥చిర॥ |
| పెక్కుమతములు చూచి బెండుపడ్డవారు లేరా పక్కన నన్నివిద్యలాఁ బరగినవారు లేరా వోక్కఁడే శ్రీవేంకటేశుఁ డుల్లములో నుండఁగాను యెక్కుడితనిఁ గొలువ కెవ్వరిఁ బోలేము | ॥చిర॥ |


