Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 197-3
సంపుటము: 2-498
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: పాడి
అదివో చూడరో అందరు మొక్కరో
గుదిగొనె బ్రహ్మము కోనేటిదరిని
॥పల్లవి॥
రవిమండలమున రంజిల్లు తేజము
దివిఁ జంద్రునిలో తేజము
భువి ననలంబునఁ బొడమిన తేజము
వివిధంబులైన విశ్వతేజము
॥అది॥
క్షీరాంబుధిలోఁ జెలఁగు సాకారము
సారె వైకుంఠపు సాకారము
యీరీతి యోగీంద్రులెంచు సాకారము
సారెకు జగముల సాకారము
॥అది॥
పొలసిన యాగంబులలో ఫలమును
పలు తపములలో ఫలమును
తలఁచిన తలఁపుల దానఫలంబును
బలిమి శ్రీవేంకటపతియే ఫలము
॥అది॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము