అధ్యాత్మ సంకీర్తన
రేకు: 198-4
సంపుటము: 2-505
రేకు: 198-4
సంపుటము: 2-505
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
| ఊరకే కలుగునా వున్నతపు మోక్షము శ్రీరమణు కృపచేతఁ జేరు మోక్షము | ॥పల్లవి॥ |
| కలుషముఁ బెడఁబాసి కర్మగండము గడచి మలసి నప్పుడుగా మరి మోక్షము చలనమించుక లేక సంసారవారధి దాఁటి నిలిచినప్పుడుగా నిజమోక్షము | ॥ఊర॥ |
| పంచేంద్రియాల మీరి భక్తి హరిమీఁద బెట్టి మంచివాఁడైనప్పుడుగా మరి మోక్షము అంచల యాసలు మాని ఆచార్యుసేవ చేసి మించినప్పుడుగా ఆమీఁది మోక్షము | ॥ఊర॥ |
| శాంతమే కూడుగానుండి సమచిత్తమునఁ బొంది మంతుకెక్కినప్పుడుగా మరి మోక్షము అంతట శ్రీవేంకటేశుఁ డాదరించి మన్నించితే నంతరంగమున నున్న దనాది మోక్షము | ॥ఊర॥ |


