అధ్యాత్మ సంకీర్తన
రేకు: 207-2
సంపుటము: 3-38
రేకు: 207-2
సంపుటము: 3-38
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
| ఎందరితోఁ బెనఁగేను యెక్కడని పొరలేను కందర్పజనక నీవే గతిఁ గాక మాకు | ॥పల్లవి॥ |
| నిక్కి నా బలవంతాన నే నే గెలిచేనంటే- నొక్కపంచేంద్రియముల కోపఁగలనా తక్కిన సంసారవార్ధి దాఁటఁగలనో మరి దిక్కుల కర్మబంధము తెంచివేయఁగలనో | ॥ఎంద॥ |
| పన్నుకొన్న పాయమున పరము సాధించేనంటే యెన్న నీ మాయ కుత్తర మియ్యఁగలనా వన్నెల నా మనసే పంచుకోఁగలనో మరి కన్నట్టి యీ ప్రపంచమే కడవఁగఁ గలనో | ॥ఎంద॥ |
| వుల్లములో నిన్ను ధ్యాన మొగి నేఁ జేసేనంటే తొల్లిటి యజ్ఞానము తోయఁగలనా ఇల్లి దే శ్రీవేంకటేశ యెదుటనే నీకు మొక్కి బల్లిదుఁడ నౌదుఁగాక పంద నేఁ గాఁగలనా | ॥ఎంద॥ |


