అధ్యాత్మ సంకీర్తన
రేకు: 220-6
సంపుటము: 3-113
రేకు: 220-6
సంపుటము: 3-113
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ధన్నాసి
| అంతవాని కింతసేయ నమరునటే వింతలు యీసుద్దులకే వెరగయ్యీ మాకు | ॥పల్లవి॥ |
| కదిసి బ్రహ్మాండములు గర్భములోనున్నదేవుఁ- డిదె దేవకి గర్భాన నెట్టు పుట్టెనే అదె మఱ్ఱాకుమీఁదట నటు పవ్వళించువాఁడు యెదుట యశోదచేత నెట్టు వినోదించీనే | ॥అంత॥ |
| అడుగులుమూఁట లోకాలటు గొలచినవాఁడు బడిబడి రేపల్లెఁ బారాడీని అడరి యజ్ఞభాగము లారగించే దేవుఁడు సడితో వెన్న ముచ్చిలి చవిగొనీనిదివో | ॥అంత॥ |
| వేదపల్లవములందు విహరించే దేవుఁడు సాదుగొల్లెతల రతిసంగడిఁ జిక్కె మోదపు వైకుంఠాన ముదమందే కృష్ణుడు యీదెస శ్రీవేంకటాద్రి నిరవాయ నిదివో | ॥అంత॥ |


