అధ్యాత్మ సంకీర్తన
రేకు: 221-4
సంపుటము: 3-117
రేకు: 221-4
సంపుటము: 3-117
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ధన్నాసి
| శరణాగత వజ్రపంజరుఁ డీతఁడు చక్రధరుఁ డసురసంహారుఁడు వెరవుతోడఁ దను శరణనువారి వెనుబల మీతఁడే రక్షకుఁడు | ॥పల్లవి॥ |
| హరినామోచ్చారణఁ దెగనికర్మ మవల వేరొకటున్నదా అరసి యెందు నమ్మిక చాలక ప్రాయశ్చిత్తంబులు చెప్పుదురు ధర నెరఁగనివారేమనినాఁ దామసులగొడవ యేమిటికి హరిహరి యంటే దురితము లణఁగెను అతఁడే మాకిఁక రక్షకుఁడు | ॥శర॥ |
| శ్రీపతి దిక్కయి కావఁగ మరియునుఁ జేరని సంపద లిఁకనేవి చాపలబుద్ధుల (లు?) నది నమ్మక విచ్చనవిడి నోములు చెప్పుదురు తీపులు పుట్టించి యెవ్వరేమనినఁ దెలిపి వాదడువ నేమిటికి శ్రీపతిఁ గొలిచితి చేరె సంపదలు జిగి నితఁడే మా రక్షకుఁడు | ॥శర॥ |
| అంతరాత్మ శ్రీవేంకటేశ్వరుఁడు అన్యము భజించఁ జో టేది యింతట నమ్మక దేవతాంతరము లేఁటేఁటివో మరి చెప్పుదురు యెంతలేదు ప్రాకృతజనముల భ్రమ యెవ్వరిఁ గాదన నేమిటికి యింతకు శ్రీవేంకటేశుదాసులము యీతఁడే మాకిఁక రక్షకుఁడు | ॥శర॥ |


