అధ్యాత్మ సంకీర్తన
రేకు: 222-2
సంపుటము: 3-121
రేకు: 222-2
సంపుటము: 3-121
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
| పురుషోత్తముఁడ నీవే పుణ్యము గట్టుక నన్ను దరిచేర్చి రక్షించి దయఁ జూడఁగదవే | ॥పల్లవి॥ |
| ధరలో యాచకునకు ధర్మాధర్మము లేదు సిరులఁ గాముకునికి సిగ్గులేదు పరమపాతకునకు భయమించుకాలేదు విరసపు నాకై తే వివేకమే లేదు | ॥పురు॥ |
| మించిన కృతఘ్నునికి మేలెన్నఁడును లేదు చంచలచిత్తునకు నిశ్చయమే లేదు అంచల నాస్తికునకు నాచారమే లేదు కొంచని మూర్ఖుఁడ నాకు గుణమే లేదు | ॥పురు॥ |
| మదించిన సంసారికి మరి తనివే లేదు పొదిగొన మూర్ఖునకు బుద్ధే లేదు అదన శ్రీవేంకటేశ అలమేల్మంగ దాసుఁడ- నిదివో చనవరి నాకెదురే లేదు | ॥పురు॥ |


