Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 223-4
సంపుటము: 3-129
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కాంబోది
ఏడ పెద్దల మెట్టైతిమో మరి
తోడనే నవ్వేము దొరకొని మమ్మును
॥పల్లవి॥
పంచేంద్రియములఁ బట్టగ లేమట
యెంచఁగ వివేక మెన్నటికి
అంచెల మమతల నణఁచఁగలేమట
పొంచిన బుద్ధులు భువి నెన్నటికి
॥ఏడ॥
వెడవెడ నాసలు విడువఁగ లేమట
యెడయని ధైర్యం బెన్నటికి
తొడుసగు బంధముఁ దుంచఁగ లేమట
బెడిదపు తనలో బిరుదెన్నటికి
॥ఏడ॥
కామక్రోధములఁ గడవఁగ లేమట
యీమానుషములు యెన్నటికి
కామించ శ్రీవేంకటపతి గలఁడట
నేమపుతపముల నే మెన్నటికి
॥ఏడ॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము