అధ్యాత్మ సంకీర్తన
రేకు: 224-5
సంపుటము: 3-136
రేకు: 224-5
సంపుటము: 3-136
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేవగాంధారి
| ధర్మాధర్మములాల దైవములాల నిర్మిత మాతఁడే కాని నే నేమీ నెఱఁగ | ॥పల్లవి॥ |
| పుట్టించేటివాఁడు హరి పుట్టెడివాఁడ నేను నెట్టన నున్న పనులు నే నెఱఁగ వెట్టివాఁడ నేనింతే విష్ణుఁడు నా కేలికె చుట్టిన నడుమంత్రాల సుద్దులూ నెఱఁగ | ॥ధర్మా॥ |
| లోకము దేవునిమాయ లోనైనవాఁడ నేను చేకొని కర్మములలో చేఁతలెరఁగ సాకిరి మాత్రము నేను సర్వజ్ఞుఁడాతఁడు దాకొని నేఁ దలఁచేటి తలఁపూ నెఱఁగ | ॥ధర్మా॥ |
| అంతరాత్మ యాతఁడు ఆతనిబంట జీవుఁడ పంతాన నాలోపలి భావ మెరఁగ యింతయు శ్రీవేంకటేశుఁ డిటువంటివాఁడ నేను చెంతల నానందమిది చెప్పనేమీ నెఱఁగ | ॥ధర్మా॥ |


