Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 225-5
సంపుటము: 3-142
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సాళంగనాట
కొమ్మలు చూడరే గోవిందుఁడు
కుమ్మరించీ ముద్దు గోవిందుఁడు
॥పల్లవి॥
దిట్ట బాలులతోఁ దిరిగి వీధుల
గొట్టీ నుట్లు గోవిందుఁడు
పట్టిన కోలలు పైపైఁ జాఁపుచు
కుట్టీఁ దూంట్లుగా గోవిందుఁడు
॥కొమ్మ॥
నిలువుఁగాశతో నిడిగూఁతలతో
కొలకొలమని గోవిందుఁడు
వలసిన పాలు వారలు వట్టుచు
కులికి నవ్వీ గోవిందుఁడు
॥కొమ్మ॥
బారలు చాఁపుచుఁ బట్టగ నింతులఁ
గూరిమిఁ గూడీ గోవిందుఁడు
చేరి జవ్వనుల శ్రీవేంకటాద్రిపై
గోరఁ జెనకీ గోవిందుఁడు
॥కొమ్మ॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము