అధ్యాత్మ సంకీర్తన
రేకు: 226-1
సంపుటము: 3-144
రేకు: 226-1
సంపుటము: 3-144
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సాళంగనాట
| అవధారు దేవ హరికులరామ వివిధమై నీబంటు వెలయుచున్నాఁడు | ॥పల్లవి॥ |
| అదె కలశాపురము హనుమంత రాయఁడు కదనములోన రక్కసులఁ గొట్టి యెదుట నిందరిలోన నేకాంగవీరుఁడై కొదలేక ప్రతాపించి కొలువై వున్నాఁడు | ॥అవ॥ |
| చల్లని వనాలనీడ సాగుడుఁ గొండలోన వల్లెగా వేసుకొన్న వాలముతోడ పల్లదాన వలకేలు పంతమున నెత్తుకొని కొల్లున మంటపములోఁ గొలువై వున్నాఁడు | ॥అవ॥ |
| పెక్కు పండ్లగొలలు పిడికిటఁ బట్టుకొని చక్కఁగాఁ బెరిగి పెద్దజంగ చాఁచి యిక్కువ శ్రీవేంకటాద్రి నిరవైన సర్వేశ గుక్కక నీపై భక్తిఁ గొలువై వున్నాఁడు | ॥అవ॥ |


