Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 226-3
సంపుటము: 3-146
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేసాళం
ఇందిరయుఁ దానుఁ గూడి యిట్టె వరాలొసఁగు తా
సందడించి దిక్కులెల్లా సాధించీ నిదివో
॥పల్లవి॥
వేదములే గుఱ్ఱములు విష్ణుని రథమునకు
వాదపు శాస్త్రములే తీవ్రపుఁ బగ్గాలు
పాదగు పంచభూతాలే పరగు బండికండ్లు
ఆదిగొని మనోవీధులందు నేఁగీ నిదివో
॥ఇంది॥
జీవులెల్లా సారథులు శ్రీవిభుని తేరునకు
కావించుఁ నెజ్ఞాలు పడిగల గుంపులు
భావించఁ దన ప్రకృతి పట్టపుసింహాసనము
వేవేలు సంపదలతో వెలసీ నేఁడిదివో
॥ఇంది॥
చందురుఁడు రవియును సరుస బైఁడికుండలు
చెందిన పుణ్యములెల్ల సింగారాలు
అందపు శ్రీవేంకటేశుఁ డలమేలుమంగఁ దాను
కందువల మెరయుచు కరుణించీ నిదివో
॥ఇంది॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము