Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 20-3
సంపుటము: 1-121
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: భూపాళం
వాఁడె వేంకటేశుఁడనేవాఁడె వీఁడు
వాఁడి చుట్టుఁగైదువ వలచేతివాఁడు
॥వాఁడె॥
కారిమారసుతుని చక్కని మాటలకుఁ జొక్కి
చూరగా వేదాల గుట్టు చూపినవాఁడు
తీరని వేడుకతో తిరుమంగయాళువారి
ఆరడి ముచ్చిమి కూటి కాసపడ్డవాఁడు
॥వాఁడె॥
పెరియాళువారి బిడ్డ పిసికి పైవేసిన
విరుల దండల మెడవేసినవాఁడు
తరుణి చేయి వేసిన దగ్గరి బుజము చూఁచి
పరవశమై చొక్కి పాయలేని వాఁడు
॥వాఁడె॥
పామరులఁ దనమీద పాటలెల్లాఁ బాడుమంటా
భూమికెల్లా నోర నూరి పోసినవాఁడు
మామకూఁతు రలమేలుమంగ నాచారియుఁ దాను
గీముగానే వేంకటగిరి నుండేవాఁడు
॥వాఁడె॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము