అధ్యాత్మ సంకీర్తన
రేకు: 20-4
సంపుటము: 1-122
రేకు: 20-4
సంపుటము: 1-122
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
| అంటఁబారి పట్టుకోరె అమ్మలాల యిదె వెంటఁ బారనీదు నన్ను వెడమాయ తురుము | ॥అంట॥ |
| కాఁగెడు పెరుగు చాడె కవ్వముతోఁ బొడిచి లేఁగలఁ దోలుకొని అలిగిపోయీని రాఁగతనమున వాఁడె రాతిరి నారగించఁడు ఆఁగి నన్నుఁ గూడడిగె నయ్యో ఇందాఁకను | ॥అంట॥ |
| కొలఁదిగాని పెరుగు కొసరికొసరి పోరి కల వూరుఁగాయలెల్లఁ గలఁచిపెట్టె పలుకఁడు చేతి[1]చట్టి పారవేసి పోయీనదె చెలఁగుచు మూఁటగట్టెఁ జెల్లఁబో యిందాఁకను | ॥అంట॥ |
| మట్టుపడ కిటు నూరుమారులైనా నారగించు ఇట్టె యిందరిలోని నిన్నాళ్ళును వెట్టికి నాకొరకుఁగా వేంకటేశుఁ డారగించె[2] యెట్టు నేఁ డాఁకట ధరియించెనో యిందాఁకను | ॥అంట॥ |
[1] పెదరేకు 3- చద్ది. ‘చద్ది’ పాఠము సా.రే.లోనే కలదు. ‘చట్టి’ పాఠము దేనిలోనిదో?
[2] పెదరేకు 3- గించు.


