Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 20-6
సంపుటము: 1-124
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం, అటతాళం
తనదీఁ గాక [1]యిందరిదీఁ గాక
తనువెల్ల బయలై దరి చేరదు
॥తనదీ॥
కడుపూ నిండదు కన్నూఁ దనియదు
కడఁగి లోని యాఁకలియుఁ బోదు
సడిఁ బడి కుడిచిన కుడుపెల్ల నినుము
గుడిచిన నీరై కొల్లఁబోయె
॥తనదీ॥
చవియూఁ దీరదు చలమూఁ బాయదు
లవలేశమైన నొల్లకపోదు
చివచివ నోటికడవలోని నీరై
కవకవ నవియుచుఁ గారీని
॥తనదీ॥
అలపూఁ దోఁపదు అడవీ నెండదు
యెలయించు భంగమయినఁ బోదు
తెలిసి వేంకటగిరిదేవునిఁ దలఁపించు
తలఁపైనఁ దనకు ముందర నబ్బదు
॥తనదీ॥

[1] ‘యెందరి’ అని రేకు.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము