Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 237-4
సంపుటము: 3-213
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శుద్ధవసంతం
లే దందువల్లఁ దెలివి యెన్నటికిని
నీ దయ నాపై నించినఁ గాని
॥పల్లవి॥
అరయఁగఁ బ్రపంచ మలవడినటువలె
అరుదగు వై రాగ్య మలవడదు
తరుణులరతి మతిఁ దలఁచినయటువలె
ధర నీ సాకారము దలఁచదు మనసు
॥లేదం॥
గొనకొన్న యర్థము గోరినయటువలె
కొనయగు మోక్షము గోరదు
తనుభోగములకుఁ దగిలినయటువలె
తనిసి నీకథలకుఁ దనియదు మనసు
॥లేదం॥
చలమును బాపము చవియైనటువలె
సలలితపుణ్యము చవిగాదు
సులభ శ్రీవేంకటేశుఁడ నీమహిమిది
గలిగితివి నాకుఁ గలఁగదు మనసు
॥లేదం॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము