అధ్యాత్మ సంకీర్తన
రేకు: 238-6
సంపుటము: 3-221
రేకు: 238-6
సంపుటము: 3-221
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: భైరవి
| కరుణానిధి నీవే కనుఁగొంచునున్నాఁడవు యిరవై నాలో నున్నాఁడ వేది గతి యిఁకను | ॥పల్లవి॥ |
| పేరుచున్నవి నాలోనఁ బెక్కు వికారములు వూరుచున్నవెన్నైనా వూహలెల్లాను చేరుచున్నవొక్కొక్కటే సేనాసేనకోరికలు యీరీతి నున్నాఁడ నాకు నేది గతి యిఁకను | ॥కరు॥ |
| పట్టుచున్నవి నానాప్రకృతుల వోజలు పుట్టుచున్నవి యనేకభోగేచ్ఛలు చుట్టుకొనుచున్నవి సులభపు వేడుకలు యిట్టివి నానడతలు యేది గతి యిఁకను | ॥కరు॥ |
| సందడింపుచున్నవి సారెకు నా మమతలు ముందువెనకై వున్నవి మోహాలెల్లా చెందె నీపై భక్తి నేఁడు శ్రీవేంకటేశ్వర యెందునూ నీవే కాక యేది గతి యిఁకను | ॥కరు॥ |


