Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 21-2
సంపుటము: 1-126
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
ఇతఁడు చేసిన సేఁత లెన్ని లేవిలమీఁద
యితఁడు జగదేకగర్వితుఁడౌనో కాఁడో
॥ఇతఁడు॥
కుడువఁడా ప్రాణములు గొనుచుఁ బూతకిచన్ను
తుడువఁడా కపటదైత్యుల నొసలి వ్రాలు
అడువఁడా నేలతో నలమి శకటాసురుని
వడువఁడా నెత్తురులు వసుధ కంసునిని
॥ఇతఁడు॥
పెట్టఁడా దనుజారిబిరుదు లోకమునందు
కట్టఁడా బలిదైత్యు కర్మబంధముల
మెట్టఁడా కాళింగు మేటిశిరములు, నలియఁ-
గొట్టఁడా దానవులఁ గోటానఁగోట్ల
॥ఇతఁడు॥
[1]మరపఁడా పుట్టువులు మరణములుఁ బ్రాణులకు
పరపఁడా గంగఁ దన పాదకమలమున
చెరుపఁడా దురితములు శ్రీవేంకటేశుఁడిదె
నెరపఁడా లోకములనిండఁ దన కీర్తి
॥ఇతఁడు॥

[1] ఈ చరణము 2,3,4 పాదములందు ప్రాసస్థానమున శకటరేఫము పూ.ము.పా. రేకులో సాధురేఫమే.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము