Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 21-4
సంపుటము: 1-128
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: గుండక్రియ
తానే తెలియవలె తలఁచి దేహి తన్ను
మానుపువారలు మరి వేరీ
॥తానే॥
కడలేని భవసాగరము చొచ్చిన తన్ను
వెడలించువారలు వేరీ
కడుబంధములచేతఁ గట్టుపడిన తన్ను
విడిపించువారలు వేరీ
॥తానే॥
కాఁగినినుమువంటి కర్మపు తలమోపు
వేఁగు దించేటివారు వేరీ
మూఁగిన మోహపు మూఁకలు తొడిఁబడ
వీఁగఁ దోలేటివారలు వేరీ
॥తానే॥
తిరువేంకటాచలాధిపునిఁ గొలుపుమని
వెరపు చెప్పెడువారు వేరీ
పరివోని దురితకూపములఁ బడకుమని
వెరపు చెప్పెడివారలు వేరీ
॥తానే॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము