Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 21-5
సంపుటము: 1-129
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
బయలు వందిలి వెట్టి పరగఁ జిత్తము గలిగె
దయమాలి తిరుగ నాత్మజుఁ డొకఁడు గలిగె
॥బయలు॥
కనుచూపువలన నుడుగని కోరికలు గలిగె
తనుకాంక్షవలనఁ బరితాపంబు గలిగె
అనుభవానవలన మోహంధకారము గలిగె
తనివి [1]దీరమివలన తలపోఁత గలిగె
॥బయలు॥
అడియాసవలన పాయని చలంబునుఁ గలిగె
కడుమమతవలన చీఁకటి దవ్వఁగలిగె
కడలేని తమకమునఁ [2]గాఁతాళమునుఁ గలిగె
నడుమ నంతటికి మానని ప్రేమ గలిగె
॥బయలు॥
తరితీపువలన చిత్తభ్రాంతి తగఁ గలిగె
విరహంబువలన పురవేదనలుఁ గలిగె
తిరువేంకటాచలాధిపుని కరుణామృతము
పరిపూర్ణమైన యాపద నీఁదఁ గలిగె
॥బయలు॥

[1] ‘దీరని’ రేకు.

[2] ‘గాంతాళము’ పూ.ము.పా. రేకులలో అంతటా ‘గాఁతాళ’మనియే.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము