Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 247-1
సంపుటము: 3-266
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేసాక్షి
నీ దాసుల భంగములు నీవు చూతురా
యేదని చూచేవు నీకు నెచ్చరించవలెనా
॥పల్లవి॥
పాలసముద్రముమీఁదఁ బవ్వళించినట్టి నీకు
బేలలై సురలు మొరవెట్టినయట్టు
వేళతో మా మనవులు విన్నవించితిమి నీకు
యేల నిద్దిరించేవు మమ్మిట్టే రక్షించరాదా
॥నీదా॥
ద్వారకానగరములో తగ నెత్తమాడే నీకు
బీరాన ద్రౌపది మొరవెట్టినయట్టు
ఘోరపు రాజసభలఁ గుంది విన్నవించితిమి
యే రీతి పరాకు నీకు నిఁక రక్షించరాదా
॥నీదా॥
యెనసి వైకుంఠములో నిందిరఁ గూడున్న నీకు
పెనఁగి గజము మొరవెట్టినయట్టు
చనవుతో మా కోరికె సారె విన్నవించితిమి
విని శ్రీవేంకటేశుఁడ వేగ రక్షించరాదా
॥నీదా॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము