అధ్యాత్మ సంకీర్తన
రేకు: 22-4
సంపుటము: 1-134
రేకు: 22-4
సంపుటము: 1-134
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
| ఎంత సేయఁగలేదు యిటువంటి విధి యభవు- నంతవానిని భిక్ష మడుగుకొనఁ జేసె | ॥ఎంత॥ |
| కోరి చంద్రునిఁ బట్టి గురుతల్ప[1]గునిఁ జేసె కూరి మలరఁగ నింద్రుఁ గోడిఁ జేసె ఘోర కుడువఁగఁ ద్రిశంకుని నంత్యజునిఁ జేసె వీరుఁడగు నలుఁ బట్టి [2]విద్రూపుఁ జేసె | ॥ఎంత॥ |
| అతివ [3]నొడ్డుగఁ జూదమాడ ధర్మజుఁ జేసె సతి నమ్ముకొన హరిశ్చంద్రుఁ జేసె కుతిలపడ శూద్రకుని గొఱ్ఱెముచ్చుగఁ జేసె మతిమాలి కురురాజు మడుఁగు చొరఁ జేసె | ॥ఎంత॥ |
| పడని పాట్ల బరచి బ్రహ్మ తల వోఁజేసె తొడరి కాలుని కాలు దునియఁ జేసె [4]అడర నీవిధికి విధియగు వేంకటేశు కృప పడయకుండఁగ భంగపడకపోరాదు | ॥ఎంత॥ |
[1] ‘తల్పకు’ రేకు; పూ.ము.పా.
[2] ‘విద్రూపు’ చింత్యము. ‘విరూపు’ కావచ్చు. సంగీతమునకై ‘వీరూపు’ అని పాడుకొన్నా ఫరవాలేదు.
[3] ‘నొడ్డుక’ కావచ్చు.
[4] ‘అడరని విధికి’ పూ.ము.పా.


