Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 22-5
సంపుటము: 1-135
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కాంబోది
ఏఁటిసుఖము మరి యేఁటిసుఖము వొక
మాటమాత్రమున నటమటమైన సుఖము
॥ఏఁటి॥
కొనసాగు దురితములె కూడైన సుఖము
తనువిచారములలో దాకొన్న సుఖము
పనిలేని యాసలకుఁ బట్టయిన సుఖము
వెనుక ముందరఁ జూడ వెరగైన సుఖము
॥ఏఁటి॥
నిందలకు లోనైన నీరసపు సుఖము
బొందికిని లంచంబు పుణికేటి సుఖము
కిందుపడి పరుల ముంగిలి గాచు సుఖము
పందివలె తనుఁ దానె బ్రదికేటి సుఖము
॥ఏఁటి॥
ధృతిమాలి యిందరికి దీనుఁడగు సుఖము
మతిమాలి భంగములు మఱపించు సుఖము
పతివేంకటేశు కృప పడసినది సుఖము
యితరంబులన్నియును నీపాటి సుఖము
॥ఏఁటి॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము