అధ్యాత్మ సంకీర్తన
రేకు: 22-6
సంపుటము: 1-136
రేకు: 22-6
సంపుటము: 1-136
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
| దేహము దా నస్థిరమట దేహి చిరంతనుఁడౌనట దేహపు మోహపు సేఁతలు తీరుట లెన్నఁడొకో | ॥దేహము॥ |
| కన్నులఁ బుట్టినకాంక్షలు కప్పికదా దుర్బోధల కన్నులు మనసునుఁ దనియక గాసిఁ బడిరి జనులు తన్నిఁక నెరుఁగుట లెన్నఁడు తలఁపులు దొలఁగుట లెన్నఁడు తిన్నని పరవశములచేఁ దిరుగుట లెన్నఁడొకో | ॥దేహము॥ |
| సిగ్గులు దొలఁగని యాశలఁ జిక్కికదా దుర్మానపు సిగ్గుల యెగ్గులచేతను చిక్కువడిరి జనులు సిగ్గులు దొలఁగుట యెన్నఁడు చిత్తము లోనౌటెన్నఁడు తగ్గుల మొగ్గుల సేఁతలు తలఁగుట లెన్నఁడొకో | ॥దేహము॥ |
| మనసు బుట్టిన యాతఁడు మనసునఁ బెనగొని తిరుగఁగ మనసే తానగు దైవము మరచిరి యందరును అనయము తిరువేంకటపతి యాత్మఁ దలఁచి సుఖింపుచు ఘనమగు పరమానందము కలుగుట లెన్నఁడొకో | ॥దేహము॥ |


