అధ్యాత్మ సంకీర్తన
రేకు: 262-5
సంపుటము: 3-359
రేకు: 262-5
సంపుటము: 3-359
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేవగాంధారి
| పంటలభాగ్యులు వీరా బహువ్యవసాయులు అంటిముట్టి యిట్లఁ గాపాడుదురు ఘనులు | ॥పల్లవి॥ |
| పొత్తుల పాపమనేటి పోడు నఱకివేసి చిత్తమనియెడు చేను చేనుగా దున్ని మత్తిలి శాంతమనే మంచివాన వదనున విత్తుదురు హరిభక్తి వివేకులు | ॥పంట॥ |
| కామక్రోధాదులనే కలువు దవ్వివేసి వేమరు వైరాగ్యమనే వెలుఁగు వెట్టి దోమటి నాచారవిధుల యెరువులువేసి వోముచున్నారు జ్ఞానపుఁ బై రుద్యోగజనులు | ॥పంట॥ |
| యెందు చూచిన శ్రీవేంకటేశుఁ డున్నాఁడనియెడి- అందిన చేని పంట లనుభవించి సందడించి తమవంటి శరణాగతులుఁ దాము గొంది నిముడుకొందురు గురుకృప జనులు | ॥పంట॥ |


