Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 23-4
సంపుటము: 1-140
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
ఏది చూచిననుఁ గడు నిటువంటి సోద్యములే
మేదినికిఁ గిందుపడి మిన్నందనేలా
॥ఏది॥
కరిరాజుగా[1]చిన కరుణానిధివి నీవు
అరిది నరసింహరూపైతివేలా
వురగేంద్రశయనమున నుండి నీవును సదా
గరుడవాహనుఁడవై గమనించనేలా
॥ఏది॥
పురుషోత్తమఖ్యాతిఁ బొదలి యమృతము వంప
తరుణివై వుండ నిటు దైన్యమేలా
శరణాగతులకు రక్షకుఁడవై పాము నీ-
చరణములకిందైన చలముకొననేలా
॥ఏది॥
దేవతాధిపుఁడవై దీపించి యింద్రునకు
భావింప తమ్ముఁడనఁ బరగితేలా
శ్రీవేంకటాచలస్థిరుఁడవై లోకముల
జీవకోట్లలోనఁ జిక్కువడనేలా
॥ఏది॥

[1] ‘గాచినా’ రేకు; పూ.ము.పా.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము