అధ్యాత్మ సంకీర్తన
రేకు: 265-1
సంపుటము: 3-372
రేకు: 265-1
సంపుటము: 3-372
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
| ధరఁ గడపట నేజంతువుకైనా తన జన్మమే సుఖమై తోఁచు హరి గలఁడని తా నమ్మివుండఁగా నతఁడిచ్చే సుఖ మొల్లరు | ॥పల్లవి॥ |
| మొదలఁ గొందరికి స్వర్గలోకమే మోక్షసుఖంబని తోఁచును అదె కొందరికి దేవత్వమే బ్రహ్మానందంబై తోఁచును వుదుటునఁ గొందరికి సంసారమే వున్నతసుఖమై తోఁచును తుద నా మీఁదటి హరిదాస్యసుఖము ధ్రువపట్టంబని కానరు | ॥ధరఁ॥ |
| సొరిదిఁ గొందరటు శూన్యతత్త్వమే సుఖమని మాఁటలనందురు యిరవెరఁగనివారికి ధనధాన్యము లెక్కువ సుఖమై తోఁచును నిరతిఁ గొందరికి చిరజీవులౌటే నిత్యసుఖంబని తోఁచును వరుసల శ్రీపతిపై భారంబిదె వైరాగ్యపుసుఖ మెఱఁగరు | ॥ధరఁ॥ |
| యెక్కడ చూచిన మాయలసుఖములు యెన్నైనాఁ గలవెప్పుడును చొక్కపు శ్రీవేంకటపతి తోడుట సుఖియించేటి సుఖ మొల్లరు యిక్కడ నక్కడ నీతని దాసులే యేచి సుఖింతురు నిజసుఖము కిక్కిరిసిన యజ్ఞానాంధకారులు కిందును మీఁదును నెరఁగరు | ॥ధరఁ॥ |


