అధ్యాత్మ సంకీర్తన
రేకు: 265-2
సంపుటము: 3-373
రేకు: 265-2
సంపుటము: 3-373
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: మలహరి
| నీకెటు వలసె నటుసేయి నీచిత్తము నా భాగ్యము యేకడనైనా లక్ష్మీకాంతుఁడ ఇదియే పో నా విన్నపము | ॥పల్లవి॥ |
| నాగుణములే యెంచితినా నరక కూపములు చాలవు ఆగతినే నాకర్మములూ అనుభవించి తీర్చెనంటే నీ గుణములే యెంచితివా నిఖిలసంపదలు చాలవు యీగి ననుఁ గరుణించి యెపుడు నీవిచ్చేనంటేను | ॥నీకె॥ |
| నా పాపములే లెక్కించితినా నదుల యిసుకలునుఁ జాలవు యేపున నెంతైనాఁ గలదు అది యెన్నఁడు దీరును దేవా చేపట్టి నీవు రక్షించిన యాజీవుల నెంచితివా తొల్లి చూపట్టెడి యీయాకసంబు పై చుక్కలకంటే ఘనము | ॥నీకె॥ |
| మఱి నాసుద్దులు యెంచఁగ నెంచఁగ మంచముకిందే నూయి గుఱి నీకథలివి వినఁబోతే నివే కొండలుఁ గోటానఁగోట్లు నెఱవుగ శ్రీవేంకటేశ్వర నీకే నే శరణాగతి చొచ్చితిని తఱి దరిచేర్పఁగఁ గూడువెట్టఁగా దైవమ నీకే భారము | ॥నీకె॥ |


