Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 23-5
సంపుటము: 1-141
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: మలహరి
కోరుదు నామది ననిశము [1]గుణాధరు నిర్గుణుఁ గృష్ణుని
నారాయణు విశ్వంభరు నవనీతాహారు
॥కోరుదు॥
కుండలిమణిమయభూషణు కువలయదళవర్ణాంగుని
నండజపతివాహనుని నగణితభవహరుని
మండనచోరకదమనుని మాలాలంకృతవక్షుని
నిండుకృపాంబుధిచంద్రుని నిత్యానందునిని
॥కోరుదు॥
ఆగమపుంజపదార్థుని ఆపత్సఖసంభూతుని
నాగేంద్రాయతతల్పుని నానాకల్పునిని
సాగ బ్రహ్మమయాఖ్యుని సంతతగానవిలోలుని
వాగీశ్వరసంస్తోత్రుని వైకుంఠోత్తముని
॥కోరుదు॥
[2]కుంకుమవసంతకాముని గోపాంగనకుచలిప్తుని(?)
శంకరసతిమణినుతుని సర్వాత్ముని సముని
[3]శంకనినాదమృదంగుని చక్రాయుధ[4]వేదీప్తుని
వేంకటగిరినిజవాసుని విభవస[5]దాయినిని[6]
॥కోరుదు॥

[1] ‘గుణ(ణా?)’ పూ.ము.పా. ‘గుణాధారు’ వుండవచ్చునేమో.

[2] ‘గోపాంగనాకుచలిప్తకుంకుమవసంతకాముని’ అను భావముతో ఈ పాదము ఇట్లు చెడినదేమో? కొన్నితావుల యతిప్రాసల నిర్బంధము ఈ పని చేయించుచున్నది.

[3] ప్రాసనిర్బంధముతో ‘శంఖ’ ‘శంక’ అయినదేమో.

[4] ‘విదీప్తుని’ కావచ్చు.

[5] ‘విధాయకుని’ కావచ్చునేమో.

[6] దీని రచన యప్రస్తుతముగా నున్నది.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము