అధ్యాత్మ సంకీర్తన
రేకు: 267-6
సంపుటము: 3-388
రేకు: 267-6
సంపుటము: 3-388
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: రామక్రియ
| కాంతల మానమనేటి కరవట్నాలకు దిగె మంతనాన జీవుఁడనే మంచిమరకాఁడు | ॥పల్లవి॥ |
| అరిది సంసారమనే యంబుధిలోనఁ దిరిగి వురుగతి దేహపుటోడమీఁద సరిఁ బాపపుణ్యముల సరకులు నించుకొని దరి చేరె జీవుఁడనే తలమరకాఁడు | ॥కాంత॥ |
| కడలేని నిట్టూర్పుగాలి విసరఁగాను జడియుఁ గోరికలనే చాపలెత్తి అడిబరవుగ మాయ అందునిండా నించుకొని యెడతాఁకె జీవుఁడనే యీమరకాఁడు | ॥కాంత॥ |
| అలర శ్రీవేంకటేశుఁడని యేటిమాలిమి నలుదిక్కులకు నోడ నడపఁగాను ములిగె ధర్మార్థకామమోక్షధనము గడించి పలుమాఱు జీవుఁడనే బలుమరకాఁడు | ॥కాంత॥ |


