అధ్యాత్మ సంకీర్తన
రేకు: 23-6
సంపుటము: 1-142
రేకు: 23-6
సంపుటము: 1-142
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
| అటు గుడువు మనస నీ వన్నిలాగులఁ బొరలి ఇటు గలిగె నీకు నై[1]హితవిచారములు | ॥అటు॥ |
| కోరికలకునుఁ గలిగె ఘోరపరితాపంబు కూరిమికిఁ గలిగె ననుకూలదుఃఖములు తారతమ్యమములేని తలపోఁతలకుఁ గలిగె భారమైనట్టి లంపటమనెడి మోపు | ॥అటు॥ |
| తనువునకుఁ గలిగె సంతతమైన తిమ్మటలు మనువునకుఁ గలిగె నామనివికారములు పనిలేని సంసారబంధంబునకుఁ గలిగె ఘనమైన దురితసంగతితోడి చెలిమి | ॥అటు॥ |
| దేహికినిఁ గలిగె నింద్రియములను బోధింప దేహంబునకుఁ గలిగె తెగని సంశయము దేహాత్మకుండయిన తిరువేంకటేశునకు దేహిదేహాంతరస్థితిఁ జూడఁగలిగె | ॥అటు॥ |
[1] ‘నైహిక’ కావచ్చు.


