అధ్యాత్మ సంకీర్తన
రేకు: 24-1
సంపుటము: 1-143
రేకు: 24-1
సంపుటము: 1-143
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: వరాళి
| ఆపదల సంపదల నలయు టేమిట మాను రూపింప నిన్నిటను రోసిననుఁ గాక | ॥ఆపదల॥ |
| కడలేని దేహరోగంబు లేమిట మాను జడను విడిపించు నౌషధసేవఁ గాక విడవ కడియాస తను వేఁచు టేమిట మాను వొడలి కల గుణమెల్ల నుడిగిననుఁ గాక | ॥ఆపదల॥ |
| దురితసంగ్రహమైన దుఃఖ మేమిట మాను సరిలేని సౌఖ్యంబు చవిగొన్నఁ గాక కరుకైన మోహంధకార మేమిట మాను అరిది తేజోమార్గ మలవడినఁ గాక | ॥ఆపదల॥ |
| [1]చావులోఁ బెనగొన్న జన్మ మేమిట మాను [2]యీవలావలి కర్మ మెడసినఁ గాక భావింప నరుదైన బంధ మేమిట మాను శ్రీవేంకటేశ్వరుని సేవచేఁ గాక | ॥ఆపదల॥ |
[1] ‘చావుతో’ కావచ్చు.
[2] ‘యీపలాపలి’ పూ.ము.పా. ప్రాసభంగము.


