అధ్యాత్మ సంకీర్తన
రేకు: 270-4
సంపుటము: 3-404
రేకు: 270-4
సంపుటము: 3-404
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేవగాంధారి
| మాయలఁ బొరలఁగనేఁటికి మనసా కలకాలంబును యేయెడ లక్ష్మీకాంతుఁ డీతనిఁ దలఁచవుగా | ॥పల్లవి॥ |
| మన్నునఁ బుట్టిన కాయము మన్నున నణఁగేటి దింతే మిన్నుల మీఁదికిఁ బోవదు మెరయుచు నెంతైనా అన్నిట నీ జీవునికిని అంతర్యామీ దేవుఁడు యెన్నఁడుఁ బాయని బంధువుఁ డీతనిఁ దలఁచవుగా | ॥మాయ॥ |
| ధరపైఁ బుట్టిన దేహము ధరపైఁ బుట్టి(ట్టు?)న దింతే పరమానందము గోరదు పైపై నెంతయినా గరిమల నీ జీవునికిని గతియగు దేవుం డీతఁడు నిరతపు సుఖములె యొసఁగును నీవిటు దలఁచవుగా | ॥మాయ॥ |
| శ్రీవేంకటపతి సొమ్ములు చేరెడి దాతని నింతే ఆవల నితరుల నంటవు ఆతుమ లన్నియును యేవిధముల నీ జీవుని కేలికె యీదేవుండే పావనముగ బ్రదికించెను పయికొని తలఁచవుగా | ॥మాయ॥ |


