Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 271-3
సంపుటము: 3-408
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ధన్నాసి
నీ వెటుసేసిన నిజభోగ్యంబౌ
చేవలఁ గైకొని చెలఁగుటఁ గాక
॥పల్లవి॥
దేవ నీ యానతిఁ దిరిగేటి చి త్తము
నావద్ద నిలుపఁగ నా వసమా
యీవల నీవే యిచ్చిన పుట్టుగు
యేవిధిఁ దిప్పిన యిఁక మాన వశమా
॥నీవె॥
వామన నీ పంపు వచ్చిన ప్రకృతిదే
నా మాఁట వినుమన నా వసమా
శ్రీమంతుఁడ నీచేఁత దేహమిది
దోమటి గుడువక తోయఁగ వశమా
॥నీవె॥
నగధర నీ విటు నడపేటి కర్మము
నగినగి తోయఁగ నా వసమా
తగు శ్రీవేంకటదైవమ నాపాలఁ
దగిలితి వితరముఁ దలఁచఁగ వశమా
॥నీవె॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము