అధ్యాత్మ సంకీర్తన
రేకు: 271-4
సంపుటము: 3-409
రేకు: 271-4
సంపుటము: 3-409
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: భైరవి
| విశ్వరూప మిదివో విష్ణురూప మిదివో శాశ్వతులమైతి మింక జయము మా జన్మము | ॥పల్లవి॥ |
| కొండవంటి హరిరూపు గురుతైన తిరుమల పండిన వృక్షములే కల్పతరువులు నిండిన మృగాదులెల్ల నిత్యముక్త జనములు మెండుగఁ బ్రత్యక్షమాయ మేలువో నా జన్మము | ॥విశ్వ॥ |
| మేడవంటి హరిరూపు మించైన పైఁడి గోపుర- మాడనే వాలిన పక్షు లమరులు వాడలఁ గోనేటిచుట్ల వైకుంఠనగరము యీడ మాకుఁ బొడచూపె ఇహమేపో పరము | ॥విశ్వ॥ |
| కోటి మదనులవంటి గుడిలో చక్కని మూర్తి యీటు లేని శ్రీవేంకటేశుఁడితఁడు వాఁటపు సొమ్ములు ముద్ర వక్షపు టలమేల్మంగ కూటువై నన్నేలితి యెక్కువవో నాతపము | ॥విశ్వ॥ |


