అధ్యాత్మ సంకీర్తన
రేకు: 272-2
సంపుటము: 3-413
రేకు: 272-2
సంపుటము: 3-413
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
| విష్ణుఁడ వచ్యుతుఁడవు విశ్వపరిపూర్ణుఁడని వైష్ణవు లానతియ్యఁగా వట్టి చదువులేల | ॥పల్లవి॥ |
| వెన్న చేతఁబట్టి నేయి వెదకఁగ నిఁకనేల నిన్ను లోన నించుకొని నిజమేదో యననేల వున్నతి దీపమువట్టి వొగి నూతఁబడనేల పన్ని నీ దాస్యము గల్గ బహుకర్మమేల | ॥విష్ణుఁ॥ |
| చాలాధనము గల్గి సంతలఁ దిరియనేల నాలుక నీ పేరు గల్గ నానాజపములేల కాలము నేరు గుడిచి కాలువ వొగడనేల పాలించ నీ వుండఁగాను పరచింతలేల | ॥విష్ణుఁ॥ |
| మిన్ను చూచేయందుకుఁగా మిక్కిలి తోదోపు లేల అన్నిటా నీవుండఁగాను అడుగనేల యెన్నఁగ శ్రీవేంకటేశ యిందరి నేలేవు నీవే నిన్నే కొలుచుటఁ గాక నీటుగర్వాలేల | ॥విష్ణుఁ॥ |


