Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 272-5
సంపుటము: 3-416
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
బహుకుటుంబివి నీవు బ్రతుకఁగ వెరవేదో
విహగగమన నాకు వెరగయ్యీ నిందుకే
॥పల్లవి॥
పుట్టేటి జంతువులు భువనములెల్లా నిండె
ఇట్టి బ్రహ్మాండకోట్లు ఇన్నియు నీ మేన నిండె
ఇట్టె ఇందరి రక్షించే యితవైన విధమేదో
వొట్టుగ కాఁపురము నీ వుండఁగఁ జోటేదో
॥బహు॥
చిన్నిచిన్ని దేవతల చేఁతల ముద్దులు నిండె
కన్నుల నీకివి చూచి కడు సంతసాలు నిండె
మన్ననలు వీరికిచ్చి మలసేటి విధ మేదో
వున్నతి నీ చింతదీరి వుండుటిఁక నెన్నఁడో
॥బహు॥
నీ దేవియైన లక్ష్మి నిచ్చ సంపదలు నిండె
ఆదియై శ్రీవేంకటేశ ఆకె నీ వురాన నిండె
పోదియై నీవివియెల్లా భోగించేదేపొద్దో
నీదాసులము నేము నినుఁ జింతించితిమి
॥బహు॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము