అధ్యాత్మ సంకీర్తన
రేకు: 273-5
సంపుటము: 3-422
రేకు: 273-5
సంపుటము: 3-422
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: నారాయణి
| దేవ నీ పక్షపాతమో తిరిగే లోకుల వెల్తో శ్రీవిభుఁడ నీవే కాదా చిత్తములోనయ్యా | ॥పల్లవి॥ |
| దివములు సరియే దినరాత్రులును సరే యివల సుఖదుఃఖాలు హెచ్చుకుందులేలయ్యా భవములు సరియే ప్రాణములు సరియే భువిఁ బుణ్యపాపముల భోగము వేరేలయ్యా | ॥దేవ॥ |
| వినికిందరి కొకటే విషయాలు నొకరీతే మునిఁగేటి జాతిభేదము లివేలయ్యా అనయముఁ జూపొక్కటే ఆఁకలియు నొకటే పెనఁగేటి గుణముల పెక్కుజాడ లేలయ్యా | ॥దేవ॥ |
| అంతరాత్మ నీ వొక్కడ వన్నిటా శ్రీవేంకటేశ చింతలు వేవేలైన సిలుగేలయ్యా యింత సేసీ నీ మాయ లిందుకే నీ శరణంటే కాంతుఁడ న న్నిందుకే కాచితివి నేఁడయ్యా | ॥దేవ॥ |


