అధ్యాత్మ సంకీర్తన
రేకు: 274-2
సంపుటము: 3-425
రేకు: 274-2
సంపుటము: 3-425
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
| ఇన్నిటా శ్రీహరిభక్తి యిది లాభము పన్నిన తపముచేత బడలుటే లాభము | ॥పల్లవి॥ |
| యెనయఁ గర్మదేహ మిదెన్ని పాట్లు వచ్చినా ననుభవించి తీరుచు టది లాభము తన పాపవర్తన యితరు లెంత నిందించినా ననుమానించక పడుటది లాభము | ॥ఇన్ని॥ |
| తగు సంసారజీవుఁడు తన్నెంత వేసరించినా నగి రుణము దీర్చుట నానాలాభము చిగురువంటి చిత్తము చేరి యెందు దిప్పినాను తగిలి యలయుటే దక్కినట్టి లాభము | ॥ఇన్ని॥ |
| శ్రీవేంకటేశ్వరుఁడు జీవములో నుండఁగాను యేవేళ నెట్లయినా నివి లాభము పావనమైనట్టి యాత్మభావమెంత మఱచినా ఆవల నానందించుటది లాభము | ॥ఇన్ని॥ |


