అధ్యాత్మ సంకీర్తన
రేకు: 276-3
సంపుటము: 3-438
రేకు: 276-3
సంపుటము: 3-438
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ధన్నాసి
| మెచ్చుల దంపతులార మీరే గతి మెచ్చితి నిన్నిట మిమ్ము మెరసె మీ చేఁతలు | ॥పల్లవి॥ |
| తమ్మిలోని మగువా వో ధరణీధరుఁడా మిమ్ము నే నమ్మితి నాకు మీరే గతి నెమ్మది నో యిందిరా నీరజలోచనుఁడా కమ్మి యే పొద్దును మీరే కలరు నాపాలను | ॥మెచ్చు॥ |
| పాలజలధి కూఁతుర భక్త వత్సలుఁడ హరి మేలిచ్చి రక్షించ నాకు మీరే గతి కేలి నో శ్రీమహాలక్ష్మి కేశవదయానిధి తాలిమి మీరే నాకు దాపు దండ యెపుడు | ॥మెచ్చు॥ |
| చెన్నగు రమాకాంత చెందిన వో మాధవ మిన్నక యేపొద్దు నాకు మీరే గతి చిన్ని యలమేలుమంగ శ్రీవేంకటేశుఁడా యెన్నికె కెక్కించి నన్ను నేలుకొంటి రిదిగో | ॥మెచ్చు॥ |


