Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 24-5
సంపుటము: 1-147
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: వరాళి
చిత్త మతిచంచలము చేఁత బలవంతంబు
తిత్తిలో జీవుఁ డిటు దిరిగాడుఁ గాక
॥చిత్త॥
కదిసి జీవుఁడు పుట్టఁగాఁ బుట్టినటువంటి
మొదలుఁ దుదయును లేని మోహపాశములు
వదలు టెటువలెఁ దారు వదలించు టెటువలెను
పదిలముగ వీనిచేఁ బడి పొరలుఁ గాక
॥చిత్త॥
కడలేని జన్మసంగ్రహములై యెన్నఁడును
గడుగ వసములు గాని కర్మపంకములు
విడుచు టెటువలెఁ దారు విడిపించు టెటువలెను
విడువని విలాపమున వేఁగుటలు గాక
॥చిత్త॥
యిందులోపల జీవుఁ డెన్నఁడే నొకమాటు
కందు వెఱిఁగి వివేకగతుల భాగ్యమున
అందముగఁ దిరువేంకటాద్రీశు సేవించి
అందరాని సుఖంబు లందుఁ గాక
॥చిత్త॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము