అధ్యాత్మ సంకీర్తన
రేకు: 277-4
సంపుటము: 3-445
రేకు: 277-4
సంపుటము: 3-445
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
| నీవు నట్ల నేరుపు నేరమి నేఁడు నా యెడకుఁ జూడకుమీ సేవలయెడ తృణము మేరువుగఁ జేసుకోఁగలవు నీమహిమలను | ॥పల్లవి॥ |
| తప్పు లెరంగము వొప్పు లెరంగము దైవమ నే నిను నుతియించేదా నెప్పున వేదము సకలశబ్దము నీవేయని చాటఁగ వినుచు ఇప్పుడు ద్రిష్టాంత మొకటి చెప్పెద నిందుకు సముద్రుఁ డిటు తనలో చిప్పలు గుల్లలు బహురత్నంబులు చేకొని గర్భీకరించుఁ గదా | ॥నీవు॥ |
| కర్మ మెరంగ నకర్మ మెరంగను కరుణానిధి నినుఁ బూజించేదా నిర్మల వేదము చైతన్యంబిది నీవేయని చాటఁగ వినుచు అర్మిలి ద్రిష్టాంత మిందుకు నొకటె అన్నియు గర్భీకరించుకొని ధర్మాధర్మపు మనుజులనెల్లాఁ దగ నీ భూకాంత మోచుఁ గదా | ॥నీవు॥ |
| జ్ఞాన మెరఁగ నజ్ఞాన మెరఁగను సారెకు నిను నేఁ దలఁచేదా ఆనిన వేదము శ్రీవేంకటేశ్వర అంతరాత్మ నినుఁ జాటఁగను పూని ద్రిష్టాంతము మీ కిటు సరిగాఁ బోలుపరా దిఁకనైనాను తానే సూర్యుఁడు రాత్రి గల బయట తన గుణము వేగి నెరపుఁ గదా | ॥నీవు॥ |


